Coronavirus Cases in Government Schools: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. కరోనా మహమ్మారి విద్యార్థులను, ఉపాధ్యాయులను వెంటాడుతోంది. అయితే.. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు కోనసీమలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నానాటికీ విజృంభిస్తోంది. కోనసీమలోని పి గన్నవరం, రాజోలు, సఖినేటిపల్లి ,మామిడికుదురు, కొత్తపేటలో ప్రభుత్వ పాఠశాలల్లో పలువురు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే 19 మంది విద్యార్థులకు, 13 మందికి పైగా ఉపాద్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ ప్రకటనల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిబంధనలతో స్కూళ్లు నిర్వహిస్తున్నప్పటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొంటున్నారు.
అయితే.. కోనసీమలోని పలు నియోజకవర్గలతోపాటు జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే అమలాపురం డివిజన్ పరిధిలో 216 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 342 కేసులు నమోదు కాగా.. ఒక్క అమలాపురం (కోనసీమ) డివిజన్‌లో 216 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటం, దీంతోపాటు పాఠశాలల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే పాఠశాలల ఇన్‌ఛార్జులకు స్పష్టమైన సూచనలిస్తూ.. చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు కోనసీమలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
కాగా.. నిన్న ఏపీలో కొత్తగా 1,623 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2021325కి చేరింది. నిన్న ఈ మహమ్మారి కారణంగా 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13911 కి చేరింది.
Also Read: