
ఉండిలో రాజుల గొడవ పతాక స్థాయికి చేరింది. టీడీపీ టికెట్ కోసం ఆల్రడీ ఇద్దరు రాజులు పోటీపడుతుంటే.. మూడో రాజు కూడా పోటీకి సిద్దమయ్యారు. రామరాజు, శివరామరాజు మధ్య రఘురామకృష్ణరాజు బరిలోకి వచ్చేస్తున్నారు. ఇంతకీ, ఉండి టికెట్ దక్కించుకునే రాజెవరు? సీటు వదులుకునే త్యాగరాజులెవరు? అధిష్ఠానం ఏం చేయబోతోంది? ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేదెవరు? అఫీషియల్‌గా అయితే మంతెన రామరాజే టీడీపీ అభ్యర్ధి. అయితే, రామరాజును అభ్యర్ధిగా ప్రకటించడం నచ్చని ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. రెబల్‌గా పోటీ చేస్తానంటున్నారు. ఆల్రడీ సొంతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సీటు కోసం ఇద్దరు రాజులు పోటీ పడుతుంటే.. కొత్తగా రఘురామకృష్ణరాజు ఎంట్రీతో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా ఉండి పంచాయితీ భీమవరానికి చేరింది. పశ్చిమగోదావరిజిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్లజెండాలు.. ప్లకార్డులతో భారీ ఎత్తున ర్యాలీ చేసిన రామరాజు అనుచురులు సీతారామలక్ష్మి ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. వంటావార్పుతో నిరసన తెలిపారు. రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరిజిల్లాలోని ఉండి టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. మారిన పరిస్థితులను బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు టికెట్ ఎగురేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నరసాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఉండి వైపు చూస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఉండి నుంచి రఘురామ పోటీపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ నేపథ్యంలో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. అయితే టికెట్ క్యాన్సిల్ అయ్యిందని కన్ఫామ్‌గా రామరాజుకు టీడీపీ అధిష్ఠానం ఎందుకు చెప్పలేకపోతోంది. లేదా రఘురామృష్ణమరాజుకైనా టికెట్ ఎందుకు కన్ఫామ్ చెయక్యలేకపోతోందని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారట. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో ఇద్దరు రాజుల మధ్య టికెట్ వార్ నడుస్తోంది కాబట్టి.. రఘురామకు ఛాన్స్ ఇస్తే ఇద్దరి సమస్యనూ పరిష్కరించినట్టేనని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో రఘురామకృష్ణం రాజు రెండు వారాల్లో ఏదో ఒక పార్టీ నుంచి తనకు టికెట్ ఖాయం అంటూ ప్రకటించారు. పైగా నామినేషన్ తేది దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ మరో రెండు రోజుల్లో టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. దాదాపు రఘురామ కృష్ణం రాజునే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు కొందరు నాయకులు. మరి ఉండి టికెట్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..