వైసీపీలో పదవుల జాతర మొదలవ్వబోతుంది. రాజకీయ నిరుద్యోగులకు పదవులు అందేందుకు సర్వం సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను కలిపి ఒకేసారి భర్తీ చేయనున్నారు. దీనికి ఈనెల 14 తేదీన ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సింగిల్ డిజిట్ నామినేషన్ పోస్టులు తప్ప మిగతావి భర్తీ చెయ్యలేదు. ఈ నేపథ్యంలో ఒకేసారి మిగిలిన పదవులు భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. దాదాపు 70 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్‌లకు మరో 840 డైరెక్టర్ల పదవులు భర్తీ కానున్నాయి. ఇక.. నామినేషన్ పోస్టుల భర్తీ విషయంలో పక్కా ఫార్ములా అమలు చేస్తుంది అధికార వైసీపీ. పదవుల భర్తీని మూడు అంచెలుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వారికి ఇందులో ఛాన్స్ ఇస్తున్నారు. చివరిగా పార్టీలో సీనియర్‌లుగా ఉంటూ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటు.. డైరెక్టర్ల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసినవారికి డైరెక్టర్లుగా పదవులు దక్కనున్నాయి. మొత్తానికి రెండేల్ల ఎదురుచూపులు నెరవేరబోతున్న సమయం ఆసన్నం కావడంతో ఆశావహులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పదవులు దక్కించుకునేందుకు తమ మార్క్ లాబీయింగ్ మొదలెట్టారు.
Also Read: సగం మెడ తెగిన కోడి పుంజు ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘటన