ఇక్కడే ఉంటా, ఇక్కడే రాజకీయం చేస్తా, ఇక్కడి ప్రజల సంతోషమే నా విధానం అంటూ తేల్చి చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇటీవల ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ పెట్టిన నేపథ్యంలో తాము ఏపీలోనే ఉంటామని స్పష్టమైన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. చంద్రబాబులా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తాము చెప్పడం లేదని, పవన్‌లా ఈ భార్య కాకపోతే, ఆ భార్య అని చెప్పడం లేదని సెటైర్లు వేశారు. ప్రతి మనిషికీ మంచి చేస్తే చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటామని, దాని కోసమే తాను తాపత్రయపడుతున్నానని వ్యాఖ్యానించారు సీఎం జగన్. కడప జిల్లా టూర్‌లో సీఎం జగన్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు బాబును డిఫెన్స్‌లో పడేసింది. తాము ఏపీలోనే రాజకీయం చేస్తామని తమ విధానాన్ని తేల్చి చెప్పారు. చంద్రబాబులా తాము మాట్లాడబోమన్నారు.
కడప జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. అక్కడ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కమలాపురం చేరుకుని 905 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కృష్ణా నది కడపకు వచ్చిందంటే కారణం మహానేత వైఎస్‌ఆర్ అని సీఎం పేర్కొన్నారు. తమది మహిళా పక్షపాత సర్కార్ అని, నేరుగా అక్కచెళ్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. అవినీతి, లంచాలు, వివిక్ష అనే మాటలే ఈ ప్రభుత్వం లేవని తెలిపారు. ఈ పాలనను, గత ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు.
పవిత్రంగా భావించే మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు సీఎం జగన్. జనవరి నెలాఖరుకు కడప స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. శని, ఆదివారాల్లో కూడా పులివెందులలోనే ఉంటారు సీఎం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి