వారం రోజుల ముందునుంచే ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల హడావుడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు అభిమానులు, పార్టీ నేతలు. తమ ప్రియతమ నేత ముఖ్యమంత్రి అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో పండుగలా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి. జగన్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు సందడి నెలకొంది. సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు వైసీపీ నేతలు. హ్యాపీ బర్త్ డే జగన్ జెండాలతో రోడ్లన్నీ త్రివర్ణంగా మారిపోయాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏపీకి భవిష్యత్ నువ్వే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటు చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లే నేషనల్ హైవే..హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసిన ఆ పార్టీ శ్రేణులు..ఇప్పుడు సీఎం కావడంతో పుట్టినరోజును మరింత ఘనంగా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో వైసీపీ జెండాలతో నింపేశారు. దీంతో డిసెంబర్ 21న పుట్టినరోజుకు ఇప్పటినుంచే రోడ్లన్నీ ఇలా వైసీపీ జెండాలు, విషెస్‌తో నింపేశారని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని మండిపడుతున్నారు.