CM Chandrababu: డబ్బుల్లేవు.. కానీ ఆలోచనలున్నాయి.. నా జీవిత ఆశయం అదే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆరునూరైనా 2027కల్లా పోలవరం పూర్తి చేస్తానని మాటిచ్చారు. మన దగ్గర డబ్బుల్లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి.. మంత్ర దండాల్లేవు కానీ తెలివితేటలున్నాయి.. వాటిని మెరుగు పెట్టుకుని అద్బుతాలు సృష్టిద్దాం రండి అంటూ.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ స్పూర్తినిచ్చే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశంలో.. అటు.. చంద్రబాబు అరెస్టు మీద, తెలంగాణతో పెండింగ్ సమస్యల మీద కూడా క్లారిటీనిచ్చే ప్రయత్నం జరిగింది.
గతంలో వైఎస్‌ఆర్ అసాధ్యమన్న పోలవరం ప్రాజెక్టును సుసాధ్యం చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ, జాప్యం కాకూడదన్న ఉద్దేశంతోనే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని చెప్పారు. 413 రోజుల రికార్డ్ టైమ్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడితే దాన్ని కాపాడుకోవడం తెలీలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.. 28 సార్లు నేరుగా ప్రాజెక్ట్‌ను సందర్శించా.. 80సార్లు రివ్యూ చేశా.. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగిఉంటే పోలవరం ప్రాజెక్టు 2021లోనే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని చెప్పారు సీఎం చంద్రబాబు.. రివర్స్ టెండరింగ్‌తో మొత్తం ధ్వంసం చేశారని, అవగాహన లేని మంత్రుల చేతిలో పడి ప్రాజెక్టు వెనక్కు వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ పట్టాలెక్కిందని చెప్పారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 2027కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చారు చంద్రబాబు.
నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవిత ఆశయం.. ఇందుకోసం 70వేల కోట్లు ఖర్చవుతుంది.. మన దగ్గర డబ్బుల్లేవు కానీ ఆలోచనలున్నాయి.. మంత్ర దండాల్లేవు.. తెలివితేటలే ఉంటాయి.. అన్నారు. అటు.. రోడ్ల నిర్మాణం విషయంలో కూడా వినూత్న ఆలోచన అమల్లో పెట్టబోతోంది కూటమి సర్కార్. రోడ్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తామని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పైలెట్ ప్రాజెక్ట్ మొదలౌతుందని చెప్పారు.
వీడియో చూడండి..
అంతకుముందు సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కూడా చర్చ జరిగింది. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసింది ఎన్టీఆరేనని, ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్ట్‌ల పునరుజ్జీవానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు కాల్వ శ్రీనివాసులు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాలువల విస్తరణపై సభ దృష్టికి తీసుకెళ్లారు సభ్యులు. త్వరలోనే పనులు చేపడతామన్నారు మంత్రి నిమ్మల.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అంశం అసెంబ్లీలో ప్రస్తావనకొచ్చింది. రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ వాంగ్మూలాన్ని తప్పుదారి పట్టించి, కుట్ర పూరితంగానే అరెస్ట్ చేశారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు అరెస్ట్ కోసం కొన్ని కీలక ఫైల్స్ మాయం చేశారంటూ పీవీ రమేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల అంశం ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉద్యోగుల వన్‌టైమ్ రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాధానం రావల్సి ఉందన్నారు ఆర్థికమంత్రి పయ్యావుల. ఒక వెయ్యీ 942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఒక వెయ్యీ 447 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. రెండురాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు, డిమాండ్లపై మంగళవారం నాటి అసెంబ్లీలో చర్చ జరిగింది. కోఆపరేటివ్ సొసైటీస్.. ఎక్సైజ్.. ప్రొహిబిషన్ చట్టాలకు సవరణలు కూడా జరిగాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..