
అమరావతి రాజధాని నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం 29 గ్రామాల సమాహారంగా చూడొద్దని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానమైన సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా భావించాలని సూచించారు. అందుకు అనుగుణంగా మూడు ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిని ఇకపై తానే స్వయంగా క్రమం తప్పకుండా పరిశీలిస్తానని సీఎం వెల్లడించారు. పనుల్లో వేగం (Speed), నాణ్యత (Quality), సమయానికి పూర్తి చేయడం (Delivery) అనే మూడు అంశాలనే ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.
పనుల వేగాన్ని మరింత పెంచి, నిర్ణయించిన గడువులోగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి నెల కనీసం 7.92 శాతం మేర పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ఉండాలని సీఎం అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్ నినో యాక్షన్ ప్లాన్ అమల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రైతు పండించే పంటకు పంట బీమా నమోదు జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని పేర్కొన్నారు.
ఎల్ నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏడాది పొడవునా సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఆర్ఎస్‌కే (రైతు సేవా కేంద్రం) స్థాయిలో ఎల్ నినో అమలు కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆగస్టు 3 నుంచి రైతులకు ఎల్ నినోపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.