Chinna Srinu: పెద్ద పరీక్షకు సిద్ధమైన చిన్న శ్రీను.. ఎమ్మెల్యే బరిలోనా.. ఎంపీ స్థానమా?

|

Jan 06, 2024 | 7:19 PM

రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికై అధ్యక్షా అనాలనే కోరిక ఉంటుంది. పార్టీలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ హోదానే వేరు. అందుకే టికెట్ కోసం నేతలు తెగ ఆరాటడుతుంటారు. విజయనగరం జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు ఈ సారి బరిలో నేనున్నా అంటున్నారట.

Chinna Srinu: పెద్ద పరీక్షకు సిద్ధమైన చిన్న శ్రీను.. ఎమ్మెల్యే బరిలోనా.. ఎంపీ స్థానమా?
Majji Srinivasa Rao Chinna Srinu,
Follow us on

రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికై అధ్యక్షా అనాలనే కోరిక ఉంటుంది. పార్టీలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ హోదానే వేరు. అందుకే టికెట్ కోసం నేతలు తెగ ఆరాటడుతుంటారు. విజయనగరం జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు ఈ సారి బరిలో నేనున్నా అంటున్నారట. అటు మేనమామ అండదండలు.. ఇటు పార్టీ సపోర్ట్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారట. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరి సీటుకు ఎసరు పెడతారనే టెన్షన్ మొదలైందట.

వైసీపీ కంచుకోటల్లో విజయనగరం జిల్లా ఒకటి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుని ఫ్యాన్ పార్టీ విజయఢంకా మోగించింది. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స వ్యూహంతో పాటు ఆయన మేనల్లుడు వియజనగరం జెడ్పీటీసీ ఛైర్మన్, వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు. అందరు పిలుచుకునే పేరు చిన్న శ్రీను ప్రణాళికలు వైసీపీకి పెట్టని కోటగా మార్చాయి. ఆ ఎన్నికల సమయంలో చిన్న శ్రీను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉండి పార్టీని నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పార్టీకి సైతం అతని మీద అపారమైన నమ్మకం ఉండటంతో.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీకి పోటీచేసే అవకాశాలు ఉండటంతో ఎవరి సీటు ఊడుతుందా అనే టెన్షన్ జిల్లా వైసీపీ నేతల్లో మొదలైందట.

చిన్న శ్రీను మంత్రి బొత్సకి స్వయానా మేనల్లుడు. 1999 లో బొత్స మొదటసారి ఎంపిగా ఎన్నికైన దగ్గర నుంచి చిన్న శ్రీను కూడా రాజకీయంగా యాక్టివ్‌ అయ్యారు. బొత్స ఢిల్లీలో, హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలు నెరిపితే, చిన్న శ్రీను షాడో బొత్సగా జిల్లా రాజకీయాలు చక్కబెట్టేవారు. 2004 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బొత్స రాష్ట్ర మంత్రి కావడంతో చిన్న శ్రీను హవా ఒక్కసారిగా పెరిగిపోయింది. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే, జిల్లాలో అంతా తానే అన్నట్టుగా చిన్న శ్రీను వ్యవహరించేవారు. ఇప్పుడు వైసీపీ హయాంలోనూ బొత్స కీలక పదవుల్లో ఉంటే.. జిల్లా క్యాడర్‌ని చిన్న శ్రీనే నడిపించాడట.

సుమారు పదిహేనేళ్లకు పైగా తెర వెనుక మంత్రాంగం నడిపిన చిన్న శ్రీను.. 2015 వైసీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీలో చేరిన అతి కొద్ది సమయంలోనే అతనికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి జిల్లాలో తనదైన శైలిలో దూసుకుపోయారు బొత్స మేనల్లుడు. చిన్న శ్రీను రాజకీయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం పూర్తిస్థాయి సహకారం అందించడంతో ఇతని చరిష్మా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న శ్రీనుకి జెడ్పీ చైర్మన్ పదవి వరించింది.

అంగ, అర్ధ బలంతో జిల్లాలో బలమైన నేతగా ఎదిగి.. తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న చిన్న శ్రీను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. కానీ ఎక్కడ నుంచి పోటీ చేయాలి.. పార్టీ ఏ సీటు కేటాయిస్తుందనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. శృంగవరపుకోట లేదంటే ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏదో ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆ రెండింటిలో పోటీ అవకాశం రాకపోతే.. విజయనగరం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో పార్టీ ఉందట. ఏడు నియోజకవర్గాల ప్రజలతో నేరుగా సత్సంబంధాలు ఉన్న చిన్న శ్రీను ఎంపీగా బరిలోకి దిగితే.. ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి లాభాన్ని చేకూరుస్తుందనే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

జిల్లాలో 2019 ఫలితాలనే మళ్లీ రిపీట్ చేయాలనే లక్ష్యంతో పార్టీ పనిచేస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలోనూ మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమీకరణాల్లో చిన్న శ్రీనువైపు పార్టీ చూస్తోందట. ఆయన కూడా పోటీకి సిద్ధంగా ఉండటంతో బరిలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోందట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…