బ్యాగ్ పట్టుకొని.. మార్కెట్‌కు వెళ్తున్నారా.. వీకెండ్‌లో షాప్‌కు వెళ్లి.. చికెన్ తీసుకురావాలనుకుంటున్నారా.. అయితే మీరు షాక్‌కు గురి కావల్సిందే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర ఆల్ టైం హైకి వెళ్లింది. చికెన్.. ముక్క లేనిది ముద్ద దిగదు కొందరికీ. మెనూలో చికెన్ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. మరో 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పు కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గి పోయిందని, జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో గత ఆదివారం స్కిన్ లెస్ కిలో రూ.270 వరకూ ఉండగా ఇప్పు డు రూ.40 పెరిగింది. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలకు తోడు.. కోడికూడా సామాన్యుడికి అందనంటోంది. మొన్నటి వరకు వారం రోజులకు ఒకసారి తినాలనుకునేవాళ్లు.. ఇప్పుడు ఆలోచించి మరీ తీసుకుంటున్నారు. నెలకు నాలుగుసార్లు తినేవాళ్లు రెండుసార్లు తింటున్నారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఎవరైనా బంధువులు వచ్చినా.. నాన్‌వెజ్ పెట్టలేకపోతున్నామన్న బాధ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బిర్యానీ, కర్రీపాయింట్లలోనూ గిరాకీ తగ్గిందని చెబుతున్నారు వ్యాపారులు. ఒకప్పుడు రోజూ 20 కిలోల వరకు అమ్మే వ్యాపారులు.. ఇప్పుడు 10 కిలోలతో సరిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు.
చికెన్ రేట్ల పెరుగుదలతో… రిటైల్ వ్యాపారులు కూడా డీలా పడిపోయారు. ఒకప్పుడున్నంత గిరాకీ ఇప్పుడు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.