
రాజమహేంద్రవరంలో పసుపు పండగ మహానాడు.. శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్ల సందడితో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా ఒకేసారి రావడంతో ఈసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా మహానాడులో పొత్తులు, మేనిఫెస్టో, తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరేలా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరంలో మహానాడు జరపడం సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాగే, ప్రపంచంలోనే తెలుగు జాతిని ముందుంచాలని ఈ మహానాడు వేదిక ద్వారా సంకల్పిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందంటూ పేర్కొన్నారు. అలాగే శుభానికి సూచకం పసుపు, రైతుకు చిహ్నం నాగలి, సంక్షేమంగా చక్రాలు, కామన్ మ్యాన్ వాహనం సైకిల్ గుర్తు ఎన్టీఆర్ సృష్టి అంటూ టీడీపీ సింబల్‌ను విశేషాలు చెప్పుకొచ్చారు. 4 ఏళ్లుగా కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకే జీవో నెం.1 వంటి చీకటి జీవోలను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ విమర్శలు గుప్పించారు.
అధికార పార్టీ ఎన్ని అరచకాలు చేసినా.. ఏ ఒక్క నాయకుడు భయపడలేదని, మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను చంపే ముందు జగన్ అంటే వదిలిపెడతామని చెప్పినా కూడా జై తెలుగుదేశం అన్నారని అందుకే ఆయన పాడె మోశానంటూ భావోద్వేగం చెందారు.
ప్రతి ఒక్క కార్యకర్తకు చంద్రన్న అండగా ఉంటాడని, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి నా ధ్యేయం అంటూ వారికి అభయమిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ రూ.2 కేజీ బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే కరెంట్, పించన్ ప్రారంభం ఎన్టీఆర్ తోనే జరిగిందని, ఫించన్ 10 రెట్లు పెంచిన పార్టీ టీడీపీ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
అలాగే, హైదరాబాద్ లో సంపద సృష్టించి ప్రపంచ పటంలో ఉంచిన ఘనత టీడీపేకే దక్కుతుందని, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2029కి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రన్ని ఉంచాలని ప్రణాళికలు రచించామంటూ తెలిపారు.