
ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు. ప్రజల ఆశీర్వాదం మాకు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభ భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణ సభ ఇదని, ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ అన్నారు చంద్రబాబు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు ఒకటయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు చంద్రబాబు. మూడు పార్టీ జెండాలు వేరైనా, అజెండా ఒక్కటే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపించే పార్టీలని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ఒక వ్యక్తి కాదని, దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి అన్నారు చంద్రబాబు. మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.. ప్రపంచ మెచ్చిన మేటి నాయకుడన్నారు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచం మెచ్చిన మెరుగైన నాయకుడు మోదీ అని అన్నారు.
పేదరికం నిర్మూలన కోసం మోదీ చేస్తున్న కృష్టికి , ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలన్నారు. వికసిత్ భారత్‌కు ఇదే సరైన సమయం అన్న చంద్రబాబు.. అందుకు మనమంతా మోదీతో ఉండాలన్నారు. భారత్‌ను నెంబర్ 1గా మార్చే శక్తి మోదీకి ఉందన్న చంద్రబాబు, భారత్ శక్తివంతమైన జాతిగా చేయగల సత్తా ఆయనలో ఉందన్నారు. దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతుందని గుర్తు చేశారు. 2014 విభజన తర్వాత సవాళ్లు, సమస్యలు అధిగమించామని, ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 11 జాతీయ విద్యా సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. దేశంలోనే ఉత్తమ రాజధానిగా అమరావతిని నిర్మాణానికి పునాదులు వేస్తే, మూడు ముక్కల మాటలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని ఆరోపించారు. పోలవరాన్ని గోదావరిలో కలిపారన్న చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా సహజ వనరులు దోచేశారన్నారు. జె బ్రాండ్‌తో కల్తీ లిక్కర్ తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నాడని విరుచుకుపడ్డారు చంద్రబాబు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను జగన్ తరిమేశాడన్న చంద్రబాబు.. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదని ధ్వజమెత్తారు. ప్రజల గుండెల్లో మనశ్శాంతి లేదన్న చంద్రబాబు, బంగారు రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశాడని ఆరోపించారు. గతంలో లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేసిన జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యాడన్నారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్‌కు ఓటు వేయొద్దని చెప్పారంటే ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్డీయే 400కు పైగా సీట్లు వస్తాయన్న చంద్రబాబు, ఏపీలో 25 సీట్లు గెలిపించే బాధ్యత మీదే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టి, రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలని చంద్రబాబు నాయుడు అభ్యర్డించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..