Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిన్ ఎలర్జీకి గురయ్యారు. ఆయనకు స్కిన్ ఎలర్జీ రావడంతో గురువారం డాక్టర్లు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చర్మ సంబంధ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. అయితే. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి 33 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. ఆయనకు చికిత్స అందించారు. తాజాగా ఆయనకు స్కిన్ అలర్జీ కూడా రావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా డెర్మటాలజిస్టులను పిలిపించి జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైల్లోనే ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిన్ అలర్జీ వచ్చినట్లు పేర్కొంటున్నారు
ఇదిలాఉంటే.. ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. ఈ నెల 16న ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5గంటల లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. వాస్తవానికి చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్ రిమాండ్ ఉంది. అటు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.మరోవైపు అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని హైకోర్ట్ తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని.. అందువల్ల ఆయనను అరెస్టు చేయబోమని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ కేసులో లోకేశ్ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామన్నారు. దీంతో లోకేశ్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..