TDP: ఇట్స్ టైమ్ టు ఫోకస్ ఆన్ పార్టీ అంటున్నారు చంద్రబాబు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. అందుకే నేతలు, కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం నింపే దిశగా కసరత్తు మొదలు పెట్టారు చంద్రబాబు. యాక్టివ్‌గా లేని నేతలను తప్పిస్తూ.. కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మారారు. అవును. పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేశారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనిచేయని వారిని పక్కనపెడుతున్నారు. కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైందని పలువురు సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ..బలోపేతం పై దృష్టి సారించారు చంద్రబాబు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు.
ఇటీవల పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు చంద్రబాబు. పని చేయని వారిపై వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. పామర్రు నియోజకవర్గానికి వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్‌రాజాను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉప్పులేటి కల్పన యాక్టివ్‌గా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణికి అవకాశం ఇచ్చారు. విశాఖ జిల్లా మాడుగులకు పివిజి కుమార్, ప్రకాశం జిల్లా దర్శి- పమిడి రమేష్, చిత్తూరు జిల్లా పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి, భీమవరానికి తోట సీతారామలక్ష్మీని ఇన్‌ఛార్జ్ లుగా నియమించారు. ప్రస్తుతం ఉన్న నేతలు పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడం, పనితీరు సరిగా లేదని కారణాలతో కొత్త నేతలకు ఛాన్స్ ఇచ్చారు.
పని చేసే వారికే పదవులు, గుర్తింపు దక్కుతాయని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, కమిటీల నియామకంతో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే మార్క్ చూపిస్తారని.. నేతలు చర్చించుకుంటున్నారు.. పార్టీ గాడిన పడాలంటే మరింత కఠినంగా ఉండాల్సిందేనన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.
Read also: Mula Nakshatra: ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం