ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్ పేరును తీసేసి జగన్ పేరు పెట్టుకోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్ పేరు తీసేయడం అంటే ఆయనను అవమానించటమేనని వెల్లడించారు. టీడీపీ పాలనలో ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ విధంగా ఐదేళ్ల కాలంలో 4,528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు దాదాపు రూ.377 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను పట్టించుకోకపోవడమే కాకుండా అంబేడ్కర్ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. ఈ పథకానికి వెంటనే అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా బీసీ, మైనారిటీ విధ్యార్థులకు రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున సహాయం అందించాం. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేడ్కర్ వంటి మహాశయుని పేరును తొలగించడం అంటే ఆయనను అవమానించడమే. ఇది జగన్ అహంకారమే. వెంటనే అంబేద్కర్ పేరును చేర్చాలి.
– చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
గతంలో అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా ప్రభుత్వం మార్చింది. ఈ పథకం ద్వారా గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది. కాగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని మార్పులు చేసింది. ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేసింది. క్యూఎస్ ర్యాంకు 200లోపు ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కాగా పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..