AP News: ఏపీలో ‘కేజీఎఫ్’.. ఆ గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల బంగారం.?

|

Jun 27, 2023 | 6:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో 'కేజీఎఫ్' బయటపడింది. ఖనిజ నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో సెన్సేషనల్ విషయాలు బయటపడ్డాయి.

AP News: ఏపీలో కేజీఎఫ్.. ఆ గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల బంగారం.?
Representative Image
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ‘కేజీఎఫ్’ బయటపడింది. ఖనిజ నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో సెన్సేషనల్ విషయాలు బయటపడ్డాయి. ఏపీలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలు ఏయే రాష్ట్రాల్లో ఎంతెంత బంగారం నిల్వలు ఉన్నాయో సర్వే చేసి.. కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలో ఉన్న గుడుపల్లె మండలంలో ‘చిగురుగుంట-బిసనట్టం’ బంగారు గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కో టన్ను ఖనిజం నుంచి దాదాపు 5 గ్రాములకు పైనే బంగారం లభిస్తుందని నిర్ధారించారు. ఇప్పుడు ఈ గనిలో ఎన్‌ఎండిసి తవ్వకాలు మొదలు పెట్టనుంది.

చిగురుగుంట- బిసనట్టం బంగారం గనిలో తవ్వకాలు నిర్వహించడానికి ఆసక్తితో ముందుకు వచ్చిన ఎన్‌ఎండీసీ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎల్‌ఓఐపై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మైనింగ్ లీజుపై డాక్యుమెంటేషన్, అలాగే ఇతర అనుమతులతో పాటు పర్యావరణ అనుమతిని కూడా సంపాదించాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ఇప్పటికే ఓ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసినట్లు సమాచారం. అన్ని పనులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించాలనేది ఎన్‌ఎండీసీ ఆలోచనగా తెలుస్తోంది.