Central Government: మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ల్యాప్‌టాప్ ఫ్రీ.. ఇంటి నుంచే సంపాదించుకునే ఛాన్స్..

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. అదే కంప్యూటర్ దీదీ - దీదీకా దుకాణ్. ఈ కార్యక్రమం ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ప్రారంభించింది. దీని ద్వారా మహిళలు తమ ఊర్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వనుంది.

Central Government: మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ల్యాప్‌టాప్ ఫ్రీ.. ఇంటి నుంచే సంపాదించుకునే ఛాన్స్..
Womens

Updated on: Jan 26, 2026 | 6:34 PM

మహిళల ఆర్ధికాభివృద్ది కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు అందిస్తోంది. ఇక పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలకు తోడ్పాటు అందించడం కోసం కేంద్రం అనేక స్కీమ్ అమలు చేస్తోంది. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్రం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే కంప్యూటర్ దీదీ-దీదీకా దుకాణ్ కార్యక్రమం. ఈ ప్రొగ్రాం ద్వారా మహిళలు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు డిజిటల్ సేవలు అందించవచ్చు. ఈ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. మహిళలు ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వ డిజిటల్ సేవలు, టికెట్ల బుకింగ్స్,ఇతర ఆన్‌లైన్ సర్వీసులను ప్రజలకు అందించడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు.

అర్హతలు

-కనీసం ఇంటర్ చదివి ఉండాలి
-కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఉండాలి
-డ్వాక్రా సంఘంలో సభ్యురాలు అయి ఉండాలి

ఉచితంగా ల్యాప్ టాప్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కీమ్ అమలవుతోంది. గ్రామ పంచాయతీల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. వీరిని కంప్యూటర్ దీదీగా నియమించి కార్యాలయాలు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా శిక్షణతో పాటు ల్యాప్‌ట్యాప్ కూడా పంపిణీ చేస్తారు. ఇక ట్రైనింగ్ అయ్యాక సెంటర్‌ నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి ప్రభుత్వం రూ.50 వేల వరకు తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తుంది. ఈ నిధుల ద్వారా బల్లలు, కుర్చీలు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

మరో కార్యక్రమం

ఇక దీదీకా దుకాణ్ కార్యక్రమానికి కూడా కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి తక్కువ ధరకు వస్తువులు పొంది వాటిని విక్రయించుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో డ్వాక్రా మహిళలకు ఫ్రీ ట్రైనింగ్ అందిస్తారు. ఈ శిక్షణలో తక్కువ ధరకే ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా వస్తువులు ఎలా పొందాలి. వాటిని ఎలా విక్రయించుకోవాలి అనే మెళుకవలు నేర్పిస్తారు. దీంతో మహిళలు ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా వస్తువులు అమ్మి సొంత ప్రాంతంలోనే డబ్బులు సంపాదించుకోవచ్చు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కానుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.