ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇటు అధికార వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో తలమునకలై ఉంది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరుస సభలతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ కూడా తమ ఓట్ల జాబితాను ఖరారు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించేందుకు మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఎన్నికల అధికారుల బృందం సోమవారం విజయవాడకు చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి రానున్నారు. ముందుగా ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష నిర్వహిస్తారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం మంగళవారం వివిధ రాజకీయ పార్టీలతో భేటీ అవుతారు. తదనంతరం జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. ఎన్నికల సన్నద్ధతపై ఈనెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్.. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు, పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో నెలకొన్న ఇబ్బందులు, నమోదు ప్రక్రియకు తగిన సమయంపై ఉన్నతాధికారులతో చర్చించిన తరువాత ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. మీడియా సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల బృందం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..