
ఏపీలోని ముఖ్యపార్టీ నేతలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటు అధికార వైసీపీ, అటు టీడీపీ, జనసేన కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందింస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా తమ ఓట్ల జాబితాను ఖరారు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్దమైంది.
సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. మంగళ, బుధవారాలు రాజకీయ నాయకులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన అధినేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. అధికార వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మార్గాని భరత్తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఓటర్ జాబితాలోని అక్రమాలను ముందుగా ఆయా పార్టీల నేతలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతపై ఈనెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్.. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు, పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో నెలకొన్న ఇబ్బందులు, నమోదు ప్రక్రియకు అవసరమైన సమయంపై ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. మీడియా సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల బృందం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..