ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని కొమ్మాదిలో దారుణం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్ రమణయ్యను దుండగులు చంపేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఐరన్ రాడ్లతో రమణయ్యపై దాడి చేశారు. వాచ్‌మన్ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన తహశీల్దార్ రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలారు. అప్రమత్తమైన సిబ్బంది తహశీల్దార్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని విశాఖ సీపీ రవిశంకర్ పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం విశాఖ చినగదిలి నుంచి బదిలీపై వచ్చారు తహశీల్దార్ రమణయ్య. ఈ క్రమంలోనే.. హత్యకు గురవ్వడం కలకలం రేపింది.
కాగా.. విశాఖలో ఎమ్మార్వో రమణయ్య హత్య సంచలనం కలిగించింది. ల్యాండ్ మాఫియా చేతిలోనే ఎమ్మార్వో హత్యకు గురయ్యారని పేర్కొంటున్నారు. విశాఖ రూరల్ ఎమ్మార్వో గా పనిచేస్తూ మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లా కొండపల్లి ఎమ్మార్వో గా బదిలీ ఆయిన రమణయ్య.. నిన్ననే కొండపల్లి ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో కొమ్మాది లోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి పది గంటల సమయంలో రమణయ్యకు ఫోన్ రావడంతో అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కు చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడి వెళ్లిన తర్వాత మరో వ్యక్తి ఎమ్మార్వోతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.. మాస్క్ వేసుకున్న నిందితుడిని.. ఎమ్మార్వో వారిస్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యింది. కొన్ని నిమిషాల వాగ్వాదం తర్వాత పదునైన ఆయుధంతో ఎమ్మార్వో పై దాడి చేశాడు.. అనంతరం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి దుండగుడు వెళ్లిపోయాడు. కాగా.. ఫోన్ చేసి ఎమ్మార్వో ను కిందకు పిలిచిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యతో వారికి సంబంధం ఉందా లేదా అన్న కోణం లో విచారణ జరుపుతున్నారు.
అయితే హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ల్యాండ్ మాఫియా పనిగా అనుమానిస్తున్నారు. మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..