కాకినాడజిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్. మూడురోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తామని జనసేన ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పవన్ కళ్యాణ్ నిన్న పర్యటించారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్.. మహిళలు, రైతులు, యువతను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో అస్వస్థతకు గురైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్.. ఎండలో తిరగటంతో మరింత అస్వస్థతకు లోనైనట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు పెన్షన్ల పంపిణీపై స్పందించారు పవన్. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు.
తన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు, తహశీల్దార్లకు నెంబర్స్ ఇస్తారు. మరి పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ట్వీట్‌లో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక పెన్షన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులకి అండగా నిలవాలని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు.