చిత్తూరు జిల్లా పుంగనూరు కోర్టు వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టుకు వచ్చిన బాలుడు అక్కడే మృతి చెందాడు. అరుదైన రక్త వ్యాధితో బాలుడు హర్షవర్దన్(9) బాధపడ్డాడు. అతడిని ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినప్పటికీ వ్యాధి నయం కాలేదు. లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారింది. మానసిక సమస్యలతో పాటు మతిస్థిమితం కూడా కోల్పోయినట్లు తెలుస్తుంది. ముక్కు నుంచి రక్తం కారుతుంది. నాలుగైదేళ్లుగా తన కుమారుడి నరకయాతన చూసిన ఆ తల్లి గుండె అవిసి పోయింది. పేగు తెంచుకుని పుట్టిన కుమారుడు.. తన కళ్ళెదుటే నరకం చూస్తుంటే తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో తమ వద్ద ఇక ఆర్థిక స్తోమత లేదని, కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి కోసం బాలుడిని తీసుకుని తల్లి అరుణ కోర్టుకు వచ్చింది. కోర్టు సెలవులో ఉండటంతో.. ఆ వేదనతోనే తిరిగి వెళ్తుండగా హర్షవర్దన్ మృతి చెందాడు. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. నాలుగేళ్ల క్రితం ఆడుకుంటూ ఉండగా మిద్దె పైనుంచి పడిపోవడంతో అరుదైన రక్త వ్యాధికి గురయ్యాడు హర్షవర్దన్. వీరి స్వస్థలం చౌడేపల్లి మండలం బీర్జేపల్లిగా తెలుస్తోంది.
Also Read: డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం