AP BJP: వైసీపీపై దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల ఎంట్రీతో కొత్త జోష్.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ‌..

| Edited By: Sanjay Kasula

Aug 24, 2023 | 7:43 PM

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ కార్య‌వ‌ర్గంలో భారీగా మార్పులు చేసారు పురంధేశ్వ‌రి.గ‌తంలో సోము వీర్రాజు అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారిని చాలామందిని ప‌క్క‌కు త‌ప్పించ‌డంతో పాటు కొంత‌మంది నేత‌ల‌కు వేరే బాధ్య‌త‌లు అప్ప‌గించారు.సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేస్తూ పార్టీ బ‌లోపేతానికి కష్ట‌ప‌డే నేత‌ల‌ను త‌న టీంలోకి తీసుకున్నారు.ఇప్ప‌టికే ఆయా రాష్ట్ర స్థాయి నేత‌లు ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

AP BJP: వైసీపీపై దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల ఎంట్రీతో కొత్త జోష్.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ‌..
Bandi Sanjay
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తాపార్టీ దూకుడు పెంచింది.రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు ఆ పార్టీ నేత‌లు.పురంధేశ్వ‌రి రాష్ట్ర అధ్య‌క్షురాలిగా బాధ్య‌తలు చేప‌ట్టిన మొద‌టి రోజు నుంచే స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.రాష్ట్ర అప్పుల విష‌యంలో ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌డుతూ వ‌స్తున్నారు.అక్క‌డితో ఆగ‌లేదు స‌రిక‌దా ఢిల్లీ వెళ్లి మ‌రీ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామ‌న్ ను క‌లిసి ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేసారు.ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితుల‌కు మించి భారీగా అప్పులు చేస్తున్నార‌ని ఆరోపించారు పురంధేశ్వ‌రి.

నేరుగా తీసుకున్న అప్పులు కాకుండా కార్పొరేష‌న్ ల పేరుతో ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.దీంతో పాటు కేంద్రం ఇస్తున్న నిధుల‌ను కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ది పేరు లేకుండా సంక్షేమం పేరుతో భారీగా అప్పులు చేయ‌డం,నిధులు ప‌క్క‌దారిప‌ట్ట‌డంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తామంటున్నారు బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి.

ఇప్ప‌టికే చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు తోడు మ‌రింత‌గా స్వ‌రం పెంచారు.వాలంటీర్ల ద్వారా హైద‌రాబాద్ కేంద్రంగా ఓట్ల తొల‌గింపు చేస్తున్నారంటూ ఏపీ స‌ర్కార్ పై మండిప‌డుతున్నారు పురంధేశ్వ‌రి.ఓట్ల తొల‌గింపు పై త్వ‌ర‌లో ఈసీకి ఫిర్యాదు చేయాల‌ని నిర్న‌యించారు.అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏపీ స‌ర్కార్ పై ఆరోప‌ణ‌లు,విమ‌ర్శ‌లు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు బీజేపీ నేత‌లు.

ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు ..

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ కార్య‌వ‌ర్గంలో భారీగా మార్పులు చేసారు పురంధేశ్వ‌రి.గ‌తంలో సోము వీర్రాజు అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారిని చాలామందిని ప‌క్క‌కు త‌ప్పించ‌డంతో పాటు కొంత‌మంది నేత‌ల‌కు వేరే బాధ్య‌త‌లు అప్ప‌గించారు.సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేస్తూ పార్టీ బ‌లోపేతానికి కష్ట‌ప‌డే నేత‌ల‌ను త‌న టీంలోకి తీసుకున్నారు.ఇప్ప‌టికే ఆయా రాష్ట్ర స్థాయి నేత‌లు ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఓవైపు పురంధేశ్వ‌రి తో పాటు జాతీయ స్థాయి నేత‌లు కూడా ఏపీ స‌ర్కార్ ను తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.

ఓట‌ర్ చేత‌న్ మ‌హాభియాన్ కార్య‌క్ర‌మంలో ఏపీ నేత‌ల‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ గా పాల్గొన్న బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కూడా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ విమ‌ర్శించారు బండి సంజ‌య్… అవినీతి,అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్ర‌భుత్వం.. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అభివృద్ది కేవ‌లం కేంద్ర ఇస్తున్న నిధుల‌తోనే జ‌రుగుతుంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక ప్ర‌భుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందంటూ బండి సంజయ్ ఏపీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.

ఏపీలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యార‌ని.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు సంజ‌య్. మొత్తానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంతో స‌మానంగా ఏపీ ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల దాడిని పెంచేసారు బీజేపీ నేత‌లు. రాబోయే రోజుల్లో ప్ర‌జా ఉద్య‌మాల ద్వారా ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌లు నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

త్వ‌ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్రకార్య‌వ‌ర్గంలో మార్పులు చేసుకుని త‌న సొంత టీంను ఏర్పాటుచేసుకున్న పురంధేశ్వ‌రి రాబోయే రోజుల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌కు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు.ఇప్ప‌టికే కేంద్రం ఇస్తున్న స్థానిక సంస్థ‌ల నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టించిందంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధ‌ర్నాలు నిర్వ‌హించారు…ఇదే అంశంపై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ను క‌లిసి ఫిర్యాదు కూడా చేసారు.స్థానిక సంస్థ‌ల నిధులు ప‌క్క‌దారి ప‌ట్టడం వ‌ల్ల గ్రామాల్లో అభివృద్ది కుంటుప‌డిపోతుందంటూ ఫిర్యాదు చేసారు.

కేంద్రం ఇచ్చిన నిధులు సర్పంచ్ ల ఖాతాల‌కు పంపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు.ఇదే ర‌కంగా ఓట్ల తొల‌గింపు అంశంపైనా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసేలా ముందుకెళ్తున్నారు.ఇలా ఒక్కో ప్ర‌జా స‌మ‌స్య‌ను తీసుకుని వాటిపై ఆందోళ‌న‌లు నిర్వ‌హించ‌డం,సంబంధిత అధికారులు లేదా కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచ‌ర‌ణ రూపొందించే ప‌నిలో ప‌డ్డారు. మొత్తానికి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ గట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం