ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేనతో BJPకి పొత్తు ఉంటుందా? లేదా?. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోన్న ప్రశ్న. ఎందుకంటే, బీజేపీకి జనసేన మిత్రపక్షం. కానీ, తెలుగుదేశంతో జత కట్టారు పవన్ కల్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు కూడా. అయితే, టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసి వెళ్తుందా లేదా? అనేది మిస్టరీగా మారింది. ఏపీ బీజేపీ అడుగులు చూస్తుంటే… ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. జనసేన తమ మిత్రపక్షం అంటూనే… ఒక్కసారిగా దూకుడు పెంచేశారు కమలం నేతలు. పొత్తుల ప్రస్తావన లేకుండానే ప్రచారాన్ని షురూ చేసేవారు. అంతేకాదు, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా గురువారం ఒక్కరోజే 25 కార్యాలయాలను ఓపెన్ చేశారు. ఇవాళ, ప్రచార రథాలను సైతం ప్రారంభించబోతోంది ఏపీ బీజేపీ.
పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. అందుకోసం ఏకంగా కార్ వ్యాన్‌లనే రెడీ చేసింది. బీజేపీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సినీ నటులతో ప్రచారం చేయించబోతోంది. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం షురూ చేసింది. మరోవైపు పార్టీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. 9,10,11 తేదీల్లో పల్లెలు పోదాం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు ఏపీ బీజేపీ నేతలు.
175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల కోసం ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ. పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థులను సిద్ధం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాక వాటిని వడబోసి తుది జాబితాను ఢిల్లీకి పంపనుంది ఏపీ బీజేపీ. కాగా బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోతే పవన్ నిర్ణయం ఏంటనేది కూడా ఇప్పుడు సస్పెన్స్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.