Andhra Pradesh: ఆంధ్రా పాలిటిక్స్‌లో ఓట్లు, సీట్ల పంచాయితీ.. ఫిర్యాదులు సరే, ఆధారాలున్నాయా?

ఏపీలో ఓట్ల పంచాయితీ పీక్స్‌కు చేరింది. ఏపీకి వచ్చిన సీఈసీ బృందానికి పరస్పరం ఫిర్యాదు చేశాయి టీడీపీ, వైసీపీ. చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అటు వైసీపీ ఓటర్లను, సానుభూతిపరులను టీడీపీ టార్గెట్ చేసిందని వైసీపీ అంటోంది. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2024 | 6:58 PM

ఏపీలో ఓట్ల పంచాయితీ పీక్స్‌కు చేరింది. ఏపీకి వచ్చిన సీఈసీ బృందానికి పరస్పరం ఫిర్యాదు చేశాయి టీడీపీ, వైసీపీ. చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అటు వైసీపీ ఓటర్లను, సానుభూతిపరులను టీడీపీ టార్గెట్ చేసిందని వైసీపీ అంటోంది. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. తాజాగా ఇందుకు బోగస్ ఓట్ల వ్యవహారంపై విపక్ష టీడీపీ, జనసేన కూటమి, అధికార వైసీపీ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని ఆరోపించారు. సచివాలయ వాలంటీర్స్‌తో ఎన్నికలు నడపాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘం చెప్పిందని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు పవన్ కళ్యాణ్‌ తెలిపారు.

సీఈసీ బృందాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు.. మొత్తం ఆరు అంశాలపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. టీడీపీ ఇల్లీగల్‌ ఓటర్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని ఆరోపించారు. కోనేరు సురేష్ అనే వ్యక్తికి రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుసని ప్రశ్నించింది. వైసీపీ ఓటర్లను, సానుభూతిపరులను టీడీపీ టార్గెట్ చేసిందన్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్న కొందరిని ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని.. ఆంధ్ర, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని సీఈసీని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

టీడీపీ, వైసీపీ లేవనెత్తిన అంశాలను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రస్తావించారు. కొన్ని పార్టీలు బోగస్‌ ఓట్ల అంశాన్ని లేవనెత్తాయని.. వాళ్ల అభ్యంతరాలను తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. బోగస్‌ ఓట్లు నమోదు చేసే వాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. ఈనెల 22వ తేదీన ఓటరు తుదిజాబితా విడుదల చేస్తామని అన్నారు.

మొత్తానికి ఓట్ల వ్యవహారంపై టీడీపీ, వైసీపీ భిన్నమైన ఫిర్యాదులు చేయడంతో.. ఓటరు జాబితా విడుదలతో ఈ పంచాయితీకి పడుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..