బంగార ధర భయపెడుతోంది. కొండెక్కుతున్న ధరతో కొనాలంటేనే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్న గోల్డ్ షాప్ నిర్వాహకులు స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు తెరలేపుతున్నారు. వాయిదాల పద్దతి ఉందిగా అంటూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతికందగానే బిచాణా ఎత్తేస్తున్నారు. గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ స్కామ్‌లు సామాన్యుడ్ని రోడ్డున పడేస్తున్నాయి.
సంకల్ప సిద్ధి పేరుతో జనాల్ని ముంచేసిన వ్యవహారం మరువకముందే గోల్డ్ స్కీం పేరుతో భారీ స్కామ్ బయటపడింది. విజయవాడలో ఆభరణ జ్యువెలర్స్ వేర్వేరు బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. జనాలను స్కీంల పేరుతో ఆకర్షించి వేలమందిని చేర్చుకున్నారు. ఇందులో భాగంగా సీతారాంపురంలో ఓ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. నెలకు 2 వేల చొప్పున 11 నెలలు కడితే 12వ నెల వాయిదా వారే చెల్లిస్తామని ప్రచారం చేశారు. మరుసటి నెలలో మొత్తం డబ్బులు.. లేదంటే దానికి సరపడా బంగారం ఇస్తామని ఊదరగొట్టారు.
అభరణ సంస్థ ప్రచారం నిజమని నమ్మి చాలామంది స్కీంలో చేరారు. ఈఎంఐ కింద డబ్బులు చెల్లించారు. తీరా గడువు ముగిసాక వెళ్తే వచ్చే నెలా.. ఆపై నెలా అంటూ నిర్వాహకులు, సిబ్బంది కాలం వెళ్లదీశారు. ఓ ఫైన్‌డే షాప్‌కి తాళాలు వేసి పత్తాలేకుండా పోయారు.
వాయిదాల పద్దతి, వన్ ప్లస్ వన్ ఆఫర్.. ఇలా రకరకాల స్కీమ్‌లతో మోసాలకు పాల్పడింది ఆభరణ. టెలీకాలర్స్, ఏజెంట్స్‌ను అపాయింట్ చేసుకుని వేలమందిని తమ స్కీమ్‌లలో చేర్పించుకుంది. ఇందులో ఎక్కువమంది దిగువ మద్యతరగతి వాళ్లే. కూలీనాలీ చేసుకుంటూ కిస్తీలు చెల్లించినవాళ్లే. ఇప్పుడు వాళ్లందర్నీ నిలువునా ముంచేసింది ఆభరణ సంస్థ. మోసపోయిన బాధితులు ఏమంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు.
ఆభరణ సంస్థ బాధితుల్లో 4వేలమందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టినట్టే. ఇప్పుడు వాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విజయవాడ సీపీ రాణాను కలిసి ఫిర్యాదు చేశారు.
స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకి తెరలేపుతున్నారు గోల్డ్ షాప్ నిర్వాహకులు. అసలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ రూల్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం.
1. ఏడాదికి మించి డిపాజిట్లు తీసుకోకూడదు
2. 11 నెలలు అయితే SEBI నుంచి పర్మిషన్
3. అనుమతి తీసుకుంటే లైసెన్స్ నంబర్ తప్పనిసరి
4. డిపాజిట్ కింద మినిమమ్ రూ.2వేలు.. మ్యాగ్జిమమ్ లక్షా 20వేలు
NBFC రూల్స్ ఎవరూ పట్టించుకోవడం లేదు. గోల్డ్ షాప్‌లను రిజిస్ట్రేషన్ చేయిస్తున్న నిర్వాహకులు..
ఆర్‌బీఐ, సెబీ రూల్స్‌ను తుంగలోకి తొక్కుతున్నారు. నిజానికి కస్టమర్‌తో వాయిదాల పద్దతిలో స్కీమ్‌లో చేర్చుకుంటే లైసెన్స్ నంబర్ తప్పనిసరిగా కస్టమర్లకు చూపించాలి. అలాగే అగ్రిమెంట్ బాండ్‌లో లైసెన్స్ నంబర్‌ని మెన్షన్ చేయాలి. కానీ అవేవీ లేకుండానే గోల్డ్ షాప్ నిర్వాహకులు మమ అనిపించేస్తున్నారు. ఎంతోమందిని మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..