Jagananna house: అమ్మకానికి జగనన్న ఇళ్లు.. ఏకంగా ఓఎల్ఎక్స్‌లో బేరం పెట్టిన లబ్ధిదారుడు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల జగనన్న కాలనీల్లో ఇళ్లను లబ్ధిదారులు విక్రయానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉండటంతో అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ లబ్దిదారుడు ఏకంగా ఓఎల్ఎక్స్‌లోనే బేరం పెట్టాడు. అప్పు చేసి రూ.9 లక్షలు పెట్టి ఇంటిని పూర్తి చేసుకున్న ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నాడు లబ్ధిదారుడు.

Jagananna house: అమ్మకానికి జగనన్న ఇళ్లు.. ఏకంగా ఓఎల్ఎక్స్‌లో బేరం పెట్టిన లబ్ధిదారుడు!
Jagananna Colony House For Sale

Edited By: Balaraju Goud

Updated on: Aug 10, 2025 | 2:48 PM

గత ప్రభుత్వం పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. పెద్ద పెద్ద కాలనీలను ఏర్పాటు చేసి వాటికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు. అయితే సాధారణ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగనన్న కాలనీల్లో పనులు ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. ఈ కాలనీల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో కాలనీల్లో మౌళిక సదుపాయాలలేమితో ఇళ్లలో ఉండేందుకు స్థానికులు ఇష్టపడటం లేదు.

ఈ క్రమంలోనే తెనాలి పట్టణ పరిధిలోని నేలపాడు జగనన్న కాలనీలో ఉన్న ఇంటిని ఓ లబ్దిదారుడు ఏకంగా ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అప్పులు చేసి నిర్మించుకున్న ఇంటిలో ఉండలేక ఇంటిని అమ్మేస్తున్నట్లు లబ్దిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేలపాడు కాలనీకిలో ఓ ఇంటిని తొమ్మది లక్షల రూపాయలకు బేరం పెట్టారు. అయితే ఏకంగా ఓఎల్ఎక్స్ లో విక్రయానికి పెట్టడంపై తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలోనే చాలామంది తమకు వచ్చిన ఇంటి స్థలాలను విక్రయించుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరకు ఇల్లు, ఇంటి స్థలాలు వస్తుండటంతో కొంతమంది కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఇల్లు అయితే తొమ్మిది లక్షల రూపాయల నుండి పన్నెండు లక్షల రూపాయల వరకూ విక్రయిస్తుండగా ఇంటి స్థలాన్ని మూడు లక్షల రూపాయల నుండి ఆరు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని పేదలకు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో ఓఎల్ఎక్స్ లో జగనన్న కాలనీ ఇల్లు ప్రత్యక్ష కావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..