
నంద్యాల జిల్లాలోని నల్లమల ప్రాంతంలో ఎలుగుబంటి భయంతో చెంచు గిరిజనులను వణికిస్తోంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ చెంచు గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచుగూడెంకు చెందిన నిమ్మల పెద్ద అంకన్న సమీపంలోని అడవిలో కట్టెల కోసం వెళ్లాడు. నిమ్మల పెద్ద అంకన్న అనే చెంచు గిరిజనుడిపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. అనుకోని ఈ దాడిలో అంకన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకన్న కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గిరిజనులు పరుగెత్తుకుంటూ వచ్చి ఎలుగుబంటిని తరిమికొట్టారు. వెంటనే తీవ్రంగా గాయపడిన అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నికడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానిక చెంచు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఇరవై రోజులుగా చెంచుగూడెం పరిసరాల్లో ఎలుగుబంటి సంచారం కొనసాగుతోంది. రాత్రి వేళల్లో ఎలుగుబంటి గూడెం వరకు వచ్చి తిరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అంతేకాకుండా గూడెంలో వీధిదీపాలు కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నామని చెంచు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి సంచారం ఉన్నందున వెంటనే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..