
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురానికి చెందిన అట్లూరి సునీల్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే నిన్న కూడా ట్రాక్టర్ లో ఎరువుల బస్తాలు తీసుకొని గ్రామానికి చెందిన రైతు పొలానికి వెళ్లాడు. అక్కడ పొలంలో ఎరువుల బస్తాలు దించుతున్నాడు. ఈ క్రమంలో పొలంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కు గురయ్యాడు. వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సునీల్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏడాది క్రితమే పెళ్లికావడం భార్య 9 నెలల గర్భవతి కూడా అవ్వడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ స్థానికులంతా రోడ్డేక్కారు. తెనాలి వేమూరు రోడ్డునై బైఠాయించి ఆందోళన చేశారు. విద్యుత్ శాఖ, రైతు స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో మ్రుతదేహాన్ని పోర్టుమార్టమ్ కు తరలించేందుకు తండ్రి వెంకయ్య సంతకం తీసుకున్నారు.
ఆ తర్వాత తీవ్ర ఆవేదనకు లోనయిన వెంకయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే కొద్దీ సేపటికే వేమూరు రైల్వే ట్రాక్ పై రైలు ఢీ కొని వ్యక్తి మరణించినట్లు గ్రామస్థులకు సమాచారం వచ్చింది. దీంతో వెంకయ్య కోసం చుట్టు పక్కల వెదికినా లాభం లేకపోయింది. అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి పరిశీలించగా చనిపోయింది వెంకయ్యే అని అర్ధం అయింది. మృతదేహాన్ని అక్కడ నుండి ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.
తండ్రి కొడుకులిద్దరూ ఒకే రోజు చనిపోవడం సునీల్ భార్య 9 నెలల గర్భవతి కావడంతో ఆకుటుంబం జీవనోపాధిని కోల్పోయింది. ఇద్దరూ చనిపోయారన్న మరణవార్త తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..