భార్యభర్తలు.. వారికి ఇద్దరు సంతానం. చింతలేని కుటుంబం. భర్త ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా చేస్తున్నాడు. భార్య హౌస్ వైఫ్. హ్యాపీగా సాగిపోతున్న లైఫ్. కానీ విధి వారిని అలా ఉండనివ్వలేదు. అతడు బ్యాంకు ద్వారా ఇచ్చిన లోన్స్ రికవరీ కాలేదు. దీంతో పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో తానే అప్పులు చేసి వాటిని చెల్లించాడు. ఆ అప్పులు పెరిగిపోతూ వచ్చాయి. ఆపైన ఎదురైన పరిస్థితులకు ఉక్కిరిబిక్కిరై.. మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. యానాంలో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిరత్న శ్రీకాంత్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అతని భార్య.. పిల్లల్ని దిగబెట్టి వచ్చేందుకు స్కూల్‌కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు శ్రీకాంత్.
తిరిగి ఇంటికి వచ్చిన భార్య.. ఎన్నిసార్లు తలుపుకొట్టినా లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కిటికీలోనుంచి చూసేసరికి.. శ్రీకాంత్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే డోర్స్ బద్దలుకొట్టి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పుడే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు. శ్రీకాంత్ యానాంకు ట్రాన్స్‌ఫర్‌పై రాకముందుకు 3 సంవత్సరాలు బందర్ బ్రాంచ్‌లో వర్క్ చేశాడు. ఆ సమయంలో టార్గెట్ మేరకు పలువురికి లోన్స్ ఇచ్చాడు. రుణాలు తీసుకున్నవారు కొందరు యగనామం పెట్టారు. దీంతో శ్రీకాంతే 60 లక్షలు అప్పు చేసి.. ఆ రుణాలు చెల్లించాడు. తర్వాత యానాంకు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చాడు. ఇక్కడ మరో 40 లక్షలు వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగింది. చివరకు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విధి నిర్వహణలో సమస్యలతో తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని భార్య గాయత్రి పోలీసులకు తెలిపింది. త్వరలో అప్పులు మొత్తం తీర్చి.. హ్యాపీగా బ్రతుదామనుకున్నామని.. కానీ ఇలా తమను వదిలేసి వెళ్లిపోయాడని ఆమె బోరుమంది. నిజంగా అతని భార్యబిడ్డల ముఖాలు చూస్తుంటే మాత్రం మనసు చివుక్కుమంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..