గుంటూరు, జనవరి 28: ఆయన రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. తల్లి రెండుసార్లు మంత్రి. అయినా ఇవేవీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. లేటు వయస్సులో రాజకీయాల్లోకి వచ్చి ముందుగానే రాజకీయాలను వీడారు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా కుటుంబానికి రాజకీయాల్లో ఘనమైన చరిత్రే ఉంది. ఇందులో భాగంగానే పదేళ్ల క్రితం గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు గల్లా జయదేవ్. 2014, 2019ల్లో పోటీ చేసి గెలిచిన జయదేవ్ వచ్చే ఎన్నికలకు తనతో పాటు తన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఇచ్చారు.
అయితే ఆయనపై ఉన్న అభిమానాన్ని కార్యకర్తలు, నాయకులు వివిధ రూపాల్లో చాటుకున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి జయదేవ్ పై అభిమానంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన బాలాజీ ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. జయదేవ్ పదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, పోరాటాలను ప్రత్యేకంగా సైకత శిల్పంలో చూపించారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల పోటోలను ఏర్పాటు చేశారు. పదేళ్ళు ఎంపీగా ఉన్న సమయంలో సాధారణ కార్యకర్తల అభిప్రాయాలకు జయదేవ్ విలువ ఇచ్చారని రాయపాటి సాయి అన్నారు. డబ్బుతో అతనికి ఎటువంటి జ్ఞాపికలు ఇవ్వలేక సైకత శిల్పం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నట్లు తెలిపారు.
సైకత శిల్పం ఏర్పాటుకు పన్నెండు గంటల సమయం పట్టినట్లు శిల్పి బాలాజీ చెప్పారు. అభిమానాన్ని సైకత శిల్పం రూపంలో చాటాలని జయదేవ్ అభిమానులు కోరడంతోనే ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశామన్నారు. గతంలో అయోధ్య రామ మందిర శిల్పంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించిన అనేక శిల్పాలను తయారు చేసినట్లు తెలిపారు. అయితే ఒక అభిమాని కోరిక మేరకు మొదటి సారి ఇటువంటి శిల్పాన్ని చేసినట్లు చెప్పారు. ఆత్మీయ విందుకు వచ్చిన అనేక మంది కార్యకర్తలు సైకత శిల్పాన్ని ఆసక్తికరంగా తిలకించారు. తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్న సాయిని కార్యకర్తలతో పాటు జయదేవ్ కూడా అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.