Badvel By Election: బద్వేల్ ప్రీమియర్ లీగ్ ఆసక్తిగా కొనసాగుతోంది. అన్ని పార్టీలకంటే ఓ అడుగు ముందే ఉంటోంది అధికార వైసీపీ. బీజేపీ పోటీ చేస్తామని చెబుతుండటంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నారు నేతలు. వైసీపీఅభ్యర్థి డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు వేశారు. ఆమె వెంట మంత్రి పెద్దిరెడ్డి, సజ్జల, ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చారు. ప్రజల దీవెనలతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి సుధ.
ఓటింగ్ ఏకపక్షంగా ఉండాలని, వైసీపీకి అత్యధిక మెజార్టీ రావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకవేళ ఎవరైనా పోటీ పెడితే మాత్రం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నించాలన్నారు. ప్రచారాన్ని ఉధృతం చేసింది అధికార వైసీపీ. పార్టీ కార్యకర్తలు, నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. బద్వేల్ ఉప ఎన్నికలో డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని సజ్జల సూచించారు. ఇక, మిగతా పార్టీలతో అనవసరం.. ఏకగ్రీవం అయితే ఓకే.. లేదంటే ఓటింగ్ ఏకపక్షంగా జరగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వైసీపీ అభ్యర్థి సుధతో నామినేషన్ వేయించిన అధికారపార్టీ ప్రచారంపై ఫోకస్ చేస్తోంది. టీడీపీ, జనసేనా తప్పుకున్నా బీజేపీ మాత్రం పోటీకే సై అంటోంది.. జనసేన పాలసీ వేరు, మా పాలసీ వేరు. బద్వేల్‌లో పోటీపై సోము వీర్రాజు రియాక్షన్ ఇది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. బద్వేల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇక, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆనారోగ్యంతో చనిపోవడంతో ఇక్కడ బైపోల్ జరుగుతోంది. సుబ్బయ్య భార్య సుధకే టికెట్ కేటాయించింది వైసీపీ. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారు కాబట్టి..ఆనవాయితీ ప్రకారం పోటీలోంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ, జనసేన ఇప్పటికే ప్రకటించాయి. బద్వేల్ ఉప ఎన్నిక 30న జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది.