
అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. గ్రూప్ 2 ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జనవరి 27) రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి 2023 డిసెంబరు 7న నోటిఫికేషన్ జారీ చేయగా మూడేళ్ల నుంచి గ్రూప్ 2 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రహసనంగా సాగింది. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల మెయిన్స్ తర్వాత తుది ఎంపిక ప్రక్రియ అడుగున పడింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చకచకా గ్రూప్ 2 నియామక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో మొత్తం 891 మంది ఎంపికైనట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ 2లో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చికాల ప్రకారం ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్‌ఓ పోస్టులను పక్కన పెట్టింది. ఇక విడుదలైన 891 తుది జాబితా హైకోర్టు తీర్పును అనుసరించి ఎంపిక చేశారు. అయితే ఇందులో 25 పోస్టులను హారిజంటల్ రిజర్వేషన్‌ల్లో మార్పులు చేసి, ఎంపిక చేసే అవకాశం ఉంది. మిగతా 866 పోస్టుల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండబోదని కమిషన్ వెల్లడించింది. ఇక మిగిలిన 14 పోస్టుల్లో 7 దివ్యాంగ కోటా, 5 రిజర్వేషన్ పోస్టులు, 2 హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోటా పోస్టులు ఉన్నాయి. ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టింది.
కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయగా.. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారికి 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 4, 2025న విడుదలయ్యాయి. అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేసు హైకోర్టులో నానుతుండటంతో తుది ఎంపిక జాబితా వెల్లడిలో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో క్రీడా కోటా పోస్టులను పక్కన పెట్టి మిగిలిన పోస్టులకు కమిషన్ తాజాగా ఫలితాలు వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.