Vasireddy Padma: ఇప్పటివరకూ ఏలిన ప్రభుత్వాలు మహిళలను ఓటు బ్యాంకుగా చూశాయని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రమే మహిళల సంక్షేమం, సాధికారిత కోసం పని చేస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పదవుల్లో, నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆమె వెల్లడించారు.
వైయస్ఆర్‌సీపీ సర్కారు మహిళా పక్షపాతి ప్రభుత్వమని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని పద్మ తెలిపారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు వాసిరెడ్డి పద్మ.
మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ ఎప్పుడైనా స్పందించారా? అని ఆమె ప్రశ్నించారు. లోకేష్, టీడీపీ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్ అని ఆమె స్పష్టం చేశారు.