వానల జోరు.. రానున్న 3 గంటలు మరింత అప్రమత్తం! బయటకు రావొద్దు

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..

వానల జోరు.. రానున్న 3 గంటలు మరింత అప్రమత్తం! బయటకు రావొద్దు
Andhra Pradesh Weather Update

Updated on: Aug 03, 2026 | 5:31 PM

అమరావతి, ఆగస్ట్ 3: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న 3 గంటలు పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా అరకు, చింతపల్లె, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా అయినాసరే వర్షాలు కాస్త గట్టిగానే కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలోని పలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, బౌయినపల్లి, చిలుకలగూడ, మారెడపల్లి, బంజారాహిల్స్‌, అమీర్‌పెట్, కుకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us