
రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో సోమవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో తీవ్ర వడగాలులు, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయన్ని తెలిపారు.
అలాగే పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు, అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. విజయనగరం జిల్లాలో 8, మన్యం జిల్లాలో 1, అల్లూరి జిల్లాలో 2, పోలవరం జిల్లాలో 7, అనకాపల్లి జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 1, మార్కాపురం జిల్లాలో 1, వైఎస్సార్ జిల్లాలో 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాలో రాగల మూడు రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మార్కాపురం(జి) కంభంలో 44.7°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.1°C, వైస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 43.8°C, కర్నూలు(జి) నగరడోన, పల్నాడు(జి) గురజాలలో 43.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.5°C, అనంతపురం(జి) భట్టువానిపల్లిలో 43.4°C, శ్రీసత్యసాయి(జి) బుక్కపట్నంలో 43.2°C, తిరుపతి(జి) బేస్తపల్లిలో 43.1°C, అన్నమయ్య(జి) నూలివీడులో 43°C, ఎన్టీఆర్(జి) చందర్లపాడు, ప్రకాశం(జి) మొగిలిచెర్లలో 42°C, అనకాపల్లి(జి) దేవరపల్లెలో 41.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలకు అధికారుల సూచన
తీవ్ర వడగాలులు, ఉష్ణోగ్రతల నేఫథ్యంలో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటైనా వెళ్తే టోపిలాంటివి ధరించాలని.. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.