రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. ఇకపై క్యాన్ బీర్‌తో పాటు 90 ఎంఎల్ మద్యం అమ్మకాలకూ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ వెల్లడించింది. కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు ల్యాబ్‌కు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. లిక్కర్ వాక్‌ఇన్ స్టోర్సులో ధరల చార్ట్ ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మద్యం స్టాక్ ఆడిట్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి ప్రత్యేక ఆడిట్ బృందం బాధ్యతలు చేపట్టనుంది.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో ‘90ఎంఎల్’ మద్యం బాటిల్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఒక క్వార్టర్… అంటే 180 ఎంఎల్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్ సీసాలు చాలా లిమిటెడ్‌గా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్ సీసా కొనాలంటే వినియోగదారుడు కనీసం రూ.200 ఖర్చ చేయాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. కాగా మద్యం అమ్మకాల చలానాలపై తనిఖీలు చేపట్టి, లోటుపాట్లను సవరించిన కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిని ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ అభినందించారు.
Also Read: అమెరికా పవర్ కౌంటర్.. అఫ్గాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై వైమానిక దాడి