ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు.. నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి తెలంగాణలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించగా.. ఇప్పుడు ఏపీలో సమ్మర్ హాలిడేస్ ఎప్పుడన్నదే అందరిలోనూ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 27తో పరీక్షలు ముగియనున్నాయి. దీంతో ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం.
అయితే పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో ఏప్రిల్ 29 నుంచే సమ్మర్ హాలిడేస్ మొదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ద్వారా అనధికారికంగా తెలిసింది. కాగా, ఈసారి స్కూల్స్‌కు వేసవి సెలవులు సుమారు 45 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం కానున్నాయి. అటు అడ్మిషన్లు కూడా జూన్ 1 నుంచి మొదలవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.