
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వందలాది ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దివ్యాంగులకు అత్యంత అవసరమైన సదరం సేవలను కూడా అదే వేదికపైకి తీసుకొచ్చింది. ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ కోసం నిరీక్షించాల్సిన పనిలేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో సేవలు పొందే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం.
సదరం సర్టిఫికెట్ కోసం గతంలో మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. స్లాట్ కోసం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మార్చారు. దివ్యాంగులు ఎక్కడ ఉన్నా.. అక్కడి నుంచే వాట్సాప్ ద్వారా సదరం సేవలు పొందే అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు
సూచనల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దివ్యాంగులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే సదరం సేవలు పొందగలుగుతున్నారు.
వాట్సాప్‌లో ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలి?
ఆన్‌లైన్ విధానం ద్వారా స్లాట్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా.. దరఖాస్తుదారే నేరుగా సేవలు పొందే అవకాశం ఉండటంతో సేవల పంపిణీ మరింత వేగవంతం కానుందని అంటున్నారు. అలాగే ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొనే దివ్యాంగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయని.. సర్టిఫికెట్, స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత వంటి సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.
డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత విస్తరిస్తూ.. ప్రజలకు సేవలను వారి చేతి వేళ్ల మీదకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సదరం సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తేవడం కూడా అదే దిశలో మరో కీలక చర్యగా అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.