AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోతానని బెదిరించి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వర్ణ మాల్యను స్నాప్‌చాట్‌లో పరిచయమైన గౌతమ్ నాయుడు మాయమాటలు, క్రిప్టో నష్టాల అబద్ధాలతో నమ్మించాడు. ఆపై చనిపోతానని బెదిరించి, దశలవారీగా కోటిన్నర రూపాయలు కొట్టేశాడు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

చనిపోతానని బెదిరించి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
Techie Loses Online Fraud
Balaraju Goud
|

Updated on: Aug 25, 2026 | 9:09 AM

Share

సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని ఓ యువతిని నమ్మించి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి నుంచి ఏకంగా రూ.1.50 కోట్లకు పైగా వసూలు చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. విజయవాడకు చెందిన స్వర్ణ మాల్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు స్నాప్‌చాట్‌లో గౌతం నాయుడు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి గౌతం నాయుడు ఆమెను నమ్మించి మోసానికి తెర లేపాడు. కొంతకాలం స్నేహంగా మెలిగిన తర్వాత తన వ్యక్తిగత సమస్యలను ఆమెతో పంచుకున్నాడు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి రూ.50 లక్షలు నష్టపోయానని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని గౌతం నాయుడు యువతిని నమ్మించాడు. తన పరిస్థితిని వివరించి ఆర్థికంగా సాయం చేయాలని వేడుకున్నాడు. నిజమేనని నమ్మిన స్వర్ణ మాల్య మొదటగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత కూడా గౌతం నాయుడు డబ్బులు కావాలని పదేపదే ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బులు ఇవ్వకపోతే తాను చనిపోతానని బెదిరిస్తూ యువతిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు అతడికి విడతల వారీగా భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తం సుమారు కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

డబ్బులు ఇచ్చినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన మోసం, బెదిరింపులు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించినట్లు సమాచారం.

ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చెప్పిన వివరాలు నిజమా? డబ్బులు ఏ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, సోషల్ మీడియా చాటింగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమస్యల పేరుతో ఎవరైనా భారీ మొత్తంలో డబ్బులు అడిగితే తొందరపడి నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us