AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు లబ్ది..

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. భూ వివాదాలకు ముగింపు పలకడమే కాకుండా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. దాదాపు 75 లక్షల పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. 2016 కంటే ముందు ఇళ్లు పొందిన వారందరికీ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించబోతున్నారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు లబ్ది..
Cm Chandrababu Naidu Revenue Review
Krishna S
|

Updated on: Apr 09, 2026 | 7:38 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాలకు చరమగీతం పాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు భూమిపై సర్వహక్కులు కల్పించే దిశగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో సుమారు 75 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా పలు వరాలను ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న భూ గందరగోళాన్ని చక్కదిద్దేందుకు రీ-సర్వే 2.0ను ప్రభుత్వం వేగవంతం చేసింది. 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే సర్వే పూర్తయిన 1,259 గ్రామాలకు సంబంధించి 9 లక్షల పాసు పుస్తకాలను జూలై నాటికి పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. జూలై తర్వాత వచ్చే ఏడాది మార్చి లోపు మరో 80 లక్షల పాసు పుస్తకాలు పంపిణీ చేసేలా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించారు.

ఇనాం భూములకు విముక్తి – కొత్త చట్టం

లక్షలాది మంది రైతులకు దశాబ్దాలుగా వేధిస్తున్న ఇనాం భూముల సమస్యకు సిఎం పరిష్కారం చూపారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (22-A) నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇతర సర్వీస్ ఇనాంలలో ఉన్న మరో లక్ష ఎకరాల భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం

2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌ల కింద పట్టాలు పొందిన ప్రతి ఇంటికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల పేద కుటుంబాలు తమ ఇళ్లను విక్రయించుకోవడానికి, గిఫ్ట్ డీడ్ ఇవ్వడానికి లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. సుమారు 13.59 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమిలో అర్హత ఉన్న 9.25 లక్షల ఎకరాలపై త్వరలోనే యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.

రక్షణ కవచంగా బ్లాక్ చెయిన్ – రికార్డ్ లాకింగ్

భూ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగించనుంది. ప్రతి రెవెన్యూ రికార్డును డిజిటలైజ్ చేసి, సాఫ్ట్ కాపీని యజమాని మొబైల్‌కు పంపుతారు. భూ యజమానులు తమ వివరాలతో రికార్డ్ లాకింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల యజమానికి తెలియకుండా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా మార్పులు చేయడం సాధ్యపడదు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. ఎక్కడా తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా భూ రికార్డుల పంపిణీ జరగాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Follow Us