Rain Alert: వామ్మో వదలని వరుణుడు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

|

Sep 10, 2024 | 6:35 AM

రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు ముంచెత్తుతుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. సెప్టెంబర్‌ 20 నుంచి 22 మధ్యలో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెల్పింది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తుందని, అయితే ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది..

Rain Alert: వామ్మో వదలని వరుణుడు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
Rain Alert
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు ముంచెత్తుతుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. సెప్టెంబర్‌ 20 నుంచి 22 మధ్యలో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెల్పింది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తుందని, అయితే ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెల్పింది. అయితే ఈ తుపాను రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపుతుందనే దానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెల్పింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెల్పింది. వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుపడనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.