కాలకూట విషం చిమ్మే శ్వేత నాగును కాపాడి మురిసిపోతున్నారు ఆ గ్రామ ప్రజలు అక్కడివారు.. శ్వేతనాగు తమకు పాము కాదని, పరమ శివుడి మెడలో ఉండి లోకాన్ని కాపాడే దైవం అని ముచ్చటపడుతున్నారు. పాముని కాపాడటం తమకు బాధ్యత అని రంగంలోకి దిగారు.. ఇంతకీ శ్వేతనాగుకు వచ్చిన కష్టం ఏంటి? ఆ నాగుపామును ఆ గ్రామస్థులు ఎలా కాపాడారు? ఓ సారి చూద్దాం..
ఇది విజయనగరం జిల్లాలోని లక్కవరపు కోట మండలం రేగ గ్రామం.. ఈ గ్రామ సమీపంలో రాతికొండ ప్రదేశంలో గుహలింగేశ్వరస్వామి గుడి ఉంది.. ఈ ఆలయ ఆవరణలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఒక శ్వేత నాగు పడిపోయింది. బావి నుండి బయటకు రావడానికి నానా అవస్థలు పడుతూ లోపలలోపలే కొట్టుకుంటూ ఉండిపోయింది. ఉదయాన్నే పొలం పనులకు అటుగా వెళ్తున్న రైతులు బావిలో శ్వేతనాగు చేస్తున్న ప్రయతాన్ని గమనించారు. ఎలాగైనా పామును కాపాడాలని నిర్ణయించుకున్నారు. ప్రాణాలకు తెగించి మరీ పామును కాపాడేందుకు సిద్ధమయ్యారు రైతులు. వెంటనే వెదురుబొంగులు, తాళ్లు వేసి చాకచక్యంగా బయటకు తీశారు. సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న శ్వేతనాగు బావి నుండి బయటకు రాగానే ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పిoది. దీంతో గ్రామస్తులు మొదట భయపడ్డారు. తరువాత తమాయించుకొని అక్కడే నిలబడిపోయి నాగుపాముకు నమస్కారం పెట్టకున్నారు. కొంతసేపటికి పాము కూడా శాంతించి మౌనంగా ఉండి పోయింది. తరువాత గ్రామస్తులు శ్వేతనాగుతో ఫోటోలు దిగి మైమరచిపోయారు. అనంతరం కొండ ప్రాంతం వైపు పంపించేశారు. అయితే శ్వేతనాగు అనేకసార్లు గుహలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సంచరిస్తూ కనిపిస్తుందని, శివుడి వద్దకు తరుచుగా వచ్చే శ్వేత నాగు తమను చల్లగా కాపాడుతుందని, తమను ఏమీ చేయదని తమ విశ్వాసాన్ని వెళ్ళబుచ్చుతున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.