AP Municipal Elections 2021 : ఏపీ మున్సిపల్ పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు మొత్తంగా సగటున 32.23 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో 11 గంటల వరకూ 28.50 శాతం, విజయనగరం జిల్లాలో 31.97 శాతం, శ్రీకాకుళంలో 24.58 శాతంగా పోలింగ్ నమోదైంది. ఇక, తూర్పుగోదావరిలో 36.31 శాతం, పశ్చిమ గోదావరిలో 34.14 శాతంగా పోలింగ్ నమోదైంది. అనంతపురంలో 31.36 శాతం, కృష్ణా జిల్లాలో- 32.64 శాతం, చిత్తూరు జిల్లాలో -30.12 శాతం, ప్రకాశంలో -36.12 శాతం, కడపలో -32.82 శాతం, నెల్లూరు జిల్లాలో – 32.67 శాతం, కర్నూలులో – 34.12 శాతం, గుంటూరులో – 33.62 శాతంగా పోలింగ్ శాతాలు నమోదయ్యాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటూ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా ఘర్షణలు చెలరేగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సాగే ఎన్నికలో.. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఎన్నికల సంఘం. పగడ్బందీ ఏర్పాట్లు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. మొత్తంగా 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా.. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగతా 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్‌లోకు ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మున్సిపల్ పోలింగ్ సాగుతోంది. అవాంఛనీయ ఘటనలు తలెత్తితే ఎదుర్కొనేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉంచారు.