Jagananna Pacha Thoranam : రానున్న రెండు మూడు నెలల్లో ‘జగనన్న పచ్చ తోరణం’ కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉపాధిలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నామని, మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ఇలాగే మొదటి స్థానంలో నిలవాలన్నారు. అందరూ అధికారులు సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పచ్చతోరణంలో అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయామని, అయితే, సమీప భవిష్యత్ లో పూర్తి స్థాయి ఫలితాలు రాబట్టాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
ఇలా ఉండగా, నీటి వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సర్కార్‌పై నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కృష్ణా జలాల వివాదంపై మంగళవారం చర్చా గోష్టి కార్యక్రమంలో ఆయన పై విధంగా స్పందించారు.