ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Jayaram) మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా మొదటిసారిగా అధికార పార్టీ నేత, మంత్రి జయరాం స్పదించారు. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తికాలేదని అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. నిధులు లేకపోవటం వల్ల ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని వివరించారు. నియోజకవర్గంలోని 40 రోడ్లు బాగా లేవన్న మంత్రి.. ఆగస్టులో రూ.2వేల కోట్లు వస్తాయని చెప్పారు. అవి రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రోడ్డ పరిస్థితిపై స్వయానా మంత్రే ఇలా మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతోన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో మినిస్టర్ జయరామ్‌ను మహిళలు అడ్డుకున్నారు. మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మంత్రి జయరామ్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తమకు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. కేవలం, హామీలేనా? నెరవేర్చే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నించడంతో గడపగడపకూ ప్రోగ్రామ్‌లో రగడ జరిగింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..