AP Mminister Anil Kumar Yadav fires on Telangana Govt.: తెలుగురాష్ట్రాల మధ్య జలజగడం ముదురుతోంది. కేటాయింపులకు లోబడే కృష్ణా నదీ నీళ్లను వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ చర్యలను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో జలాలను వృధా చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు.
ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అనిల్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నామని, శ్రీశైలం ప్రాజెక్టు నిండకూడదనే రీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగులు పైకి ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందన్న మంత్రి.. తెలంగాణ 800 అడుగులకే నీటిని విడుదల చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, ఏపీ కేటాయించిన నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ అభ్యంతరం చెబుతోందని మంత్రి మండిపడ్డారు.
జీవో జారీ చేసి మరీ జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి సామర్ధ్యంతో పని చేయాలని తెలంగాణ ఆదేశాలు జారీ చేయడం సరికాదన్న మంత్రి.. తెలంగాణ సర్కార్ చర్యలను ఏపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. త్వరలో గట్టి సమాధానం ఇస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా నదీ జలాల యాజమాన్యపు బోర్టు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్టులు కడుతోంది. త్వరలోనే కేఆర్ఎంబీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకీ లేఖ రాస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో విడుదల చేసిన నీటి మొత్తాన్ని వారి కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరతామన్నారు.