సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు దాదాపు 50-60 వేల మంది వచ్చారని టీడీపీ చేస్తున్న ప్రచారంలో బూటకమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిన్నటి సభ అట్టర్ ఫ్లాప్ షోగా ఆయన ఎద్దేవా చేశారు. జనం లేక చంద్రబాబు సభ వెలవెలపోయిందన్నారు. ఐదారుగురు అభ్యర్థులు పోగేస్తే కేవలం నాలుగైదు వేల మంది మాత్రమే చంద్రబాబు సభకు వచ్చారని అన్నారు. లేని జనాన్ని ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లో చూపించినట్లు.. టీడీపీ వాళ్లు కూడా లేని జనాన్ని ఉన్నట్లు గ్రాఫిక్స్‌తో చూపుతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా జగన్ రాజకీయాలకు అనర్హుడంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు. జనంరాని చంద్రబాబు, నారా లోకేష్‌లు అర్హులా? అంటూ ప్రశ్నించారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు అన్ని అబద్ధాలే మాట్లాడారని.. ఒక్క నిజం కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారంటూ విమర్శించారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపించిన అంబటి.. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన అంబటి.. తాను నీతిమంతుడినని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలనని అన్నారు. తనకు, తన సోదరుడికి మధ్య గ్యాప్ వచ్చిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి మధ్య ఉన్నదే చిదంబర రహస్యం అంటూ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు జాప్యంపై చంద్రబాబు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు చేతగాని తనం వల్లనే పోలవరం జాప్యం అయిందని ఆరోపించారు. చంద్రబాబు తప్పిదం వల్లే రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని అంబటి ధ్వజమెత్తారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి