లోకల్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. కూటమి నేతలకు స్పష్టమైన సందేశం!

పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి విజయానికి కృషి చేయాలని, జనసైనికుల త్యాగాలను గుర్తించి వారికి ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నేతలకు సూచించారు. 'అడవితల్లి బాట 2.0' కింద రూ.2,052 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు.

లోకల్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. కూటమి నేతలకు స్పష్టమైన సందేశం!
Dy Cm Pawan Kalyan

Updated on: Oct 11, 2026 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి కోసం కష్టపడిన జనసైనికులు, వీరమహిళల త్యాగాలను గుర్తించి, స్థానిక ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నాయకులకు సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. 2014లో కూటమికి మద్దతుగా నిలిచిన జనసైనికులు పదవులను ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలోనూ జనసైనికులు, వీరమహిళలు అండగా నిలిచారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు.

రూ.2,052 కోట్లతో అడవితల్లి బాట 2.0

గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా అవకాశాలను మెరుగుపరచడమే ‘అడవితల్లి బాట’ కార్యక్రమం లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. అడవితల్లి బాట 2.0 కింద 1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో 2,569 పనులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో పాటు మొబైల్ కనెక్టివిటీ, పర్యాటకం, వైద్య సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అటవీ శాఖ నుంచి 555 రహదారి పనులు, 136 సెల్ టవర్లు, 48 ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు వివరించారు.

గతంలో గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం..!

2019–2024 మధ్య గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల అవసరాల కంటే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామాల్లో రహదారుల నాణ్యతను ప్రజలు కూడా పర్యవేక్షించాలని, లోపాలు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి ఫలాలను ప్రతి ఆవాసానికి చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us