
ఏపీలో మరోసారి ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు పూర్తి చేయాల్సిన పరిపాలనా ప్రక్రియలను అధికారులు వేగవంతం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని అంశాలపై ప్రభుత్వం సమీక్షలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహించే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. తొలి విడతలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి, అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
పట్టణ ప్రాంతాల ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండో విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిదశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మొత్తం స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందుగా ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియలను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులో ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలూ ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్, తేదీలపై ప్రభుత్వం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. అప్పటి వరకు ఎన్నికలపై జరుగుతున్న కసరత్తులే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.