Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విజయవాడ రాజ్ భవన్ లో కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12.15 నిమిషాలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారు చేయడంతో టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు గవర్నర్ తో సమావేశమవుతారు. విజయవాడలోని ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును అసెంబ్లీ ఆమోదించడంతో.. ఈఅంశంపై గవర్నర్ ను చంద్రబాబు నాయుడు కలవనున్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై శాసనసభలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలిపినప్పటికి ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు వెళ్లడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. అయినాసరే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో చివరి అవకాశంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి పాతపేరును కొనసాగించాలని కోరనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..